హైదరాబాదులో ఏ రోడ్డులో ట్రాఫిక్ ఎలా ఉందో మీ ఇంట్లోంచి ఇలా తెలుసుకోండి!

13-10-2015 Tue 07:57

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పెడుతుందో హైదరాబాదీలకు బాగా అనుభవం. అందుకే ఉదయం, సాయంత్రం ఏ పనున్నా వాయిదా వేసుకునేందుకే మొగ్గుచూపుతారు. తప్పని సరి పరిస్థితుల్లోనే ఇల్లు దాటుతారు. ఇకపై ఈ ఇబ్బందికి చెక్ పడనుంది. హైదరాబాదు పోలీసులు ఓ మొబైల్ యాప్ ద్వారా ఏ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉందో తెలియజేయనున్నారు. ఈ యాప్ తెచ్చేందుకు పోలీసులు విశేషమైన కృషి చేశారు. 'ట్రాఫిక్ లైవ్' అనే పేరు గల ఆ యాప్ ద్వారా నగర వాసులు పోలీసులకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. అలాగే ఆటో కానీ, టాక్సీ కానీ ఎక్కిన తరువాత డ్రైవర్ అధికంగా వసూలు చేస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. దీనిని మరి కాసేపట్లో సీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనదారుల ఫోటోలను కూడా ఈ యాప్ ద్వారా పోలీసులకు పట్టించవచ్చని వారు వెల్లడించారు. అలాగే పోలీసులు తీసుకెళ్లిన వాహనాల స్టేటస్ తెలుసుకోవచ్చని వారు వివరించారు.