హైదరాబాద్ నుంచి విజయమ్మ, బెంగళూరు నుంచి షర్మిల... హుటాహుటీన ప్రయాణం

12-10-2015 Mon 15:18

నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైకాపా అధినేత జగన్ ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోంది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు, వైకాపా శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో, జగన్ తల్లి విజయమ్మ కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు. అదేవిధంగా, బెంగళూరులో ఉన్న జగన్ సోదరి షర్మిల కూడా అక్కడ నుంచి పయనమయ్యారు. జగన్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందన్న వార్తతోనే విజయమ్మ, షర్మిలలు హుటాహుటీన గుంటూరుకు బయల్దేరారు. మరోవైపు, జీజీహెచ్ వైద్యులు జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్ సతీమణి భారతి ప్రస్తుతానికి దీక్షాస్థలి వద్దే ఉన్నారు.