రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం: మంత్రి ఈటల

11-10-2015 Sun 15:48

రైతుల సమస్యలు పరిష్కరించేందుకుగాను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణలో రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. దీంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల వేతనాల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నింద వేయవద్దని సీఐటీయు నాయకులను కోరారు. వేతనాల పెంపు విషయమై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు ఎంపీ తెలిపారు.