పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడు? : ఎమ్మెల్యే రోజా

11-10-2015 Sun 14:53

ప్రత్యేక హోదా అంటూ నాడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు నోరుమెదపరెందుకంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. జగన్ దీక్షా శిబిరం వద్ద ఈరోజు ఆమె ప్రసంగించారు. "గత ఎన్నికల సందర్భంగా తిరుపతిలో జరిగిన ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ, చంద్రబాబు హామీలిచ్చారు. అందుకు ఆయనే సాక్షి" అంటూ పవన్ ను ఉద్దేశించి అన్నారు. మంత్రి నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలు, పట్టిసీమలో టీడీపీ నాయకులు కోట్లు కొల్లగొట్టడం వంటి దారుణాలు.. ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ కు కనపడటం లేదా? అని ఆమె ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, జగన్ దీక్షకు మద్దతు తెలిపి, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఫైటర్ అయితే, చంద్రబాబు చీటర్ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.