కేసీఆర్ కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా?: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

11-10-2015 Sun 14:15

వసతి గృహవిద్యార్థులకు సన్న బియ్యంకు బదులు దారుణమైన బియ్యంతో ప్రభుత్వం అన్నం పెడుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్నబియ్యం ముసుగులో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వసతిగృహాల్లో బియ్యంపై నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలని, విజిలెన్స్ దాడులు చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా? అంటూ ఆయన సవాల్ విసిరారు. వసతి గృహాల్లో దొడ్డుబియ్యం అవినీతిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.