‘గంగ్నమ్’ స్టెప్పులేసిన మల్కాజిగిరి ఎంపీ... కేరింతలు కొట్టిన ‘మల్లారెడ్డి’ విద్యార్థులు

11-10-2015 Sun 10:49

ఆయనో పార్లమెంటు సభ్యుడు. అయితేనేం ప్రజా ప్రతినిధినన్న విషయాన్ని మరిచిపోయి విద్యార్థులను కేరింతలు కొట్టించారు. ఇంతకీ ఆయనేం చేేశారో తెలుసా? కళాశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేదికపైకెక్కి స్టెప్పులేశారు. మామూలు స్టెప్పులు కాదండి బాబూ... గంగ్నమ్ నృత్యాలు చేసిన ఆయన విద్యార్థుల్లో జోష్ పెంచారు. ఇంతకీ సదరు ప్రజా ప్రతినిధి ఎవరనేగా? మీ అనుమానం. ఆయన ఎవరో కాదు... మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి. ప్రజా ప్రతినిధిగా మారే కంటే ముందే ఆయన మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతగా తెలుగు రాష్ట్రాలకు చిరపరచితులే. హైదరాబాదు కేంద్రంగా ఉన్నత విద్యలో ‘మల్లారెడ్డి విద్యా సంస్థ’ల పేరిట నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ప్రముఖ విద్యావేత్తగా ఆయన పేరుగాంచారు. నిన్న రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉర్రూతలూగించేలా గంగ్నమ్ స్టెప్పులేశారు. ఈ దృశ్యాలను ఓ టీవీ చానెల్ నేటి ఉదయం ప్రముఖంగా ప్రసారం చేసింది.