అన్నా హజారేకు మరోమారు బెదిరింపులు... భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

11-10-2015 Sun 09:16

సామాజిక ఉద్యమకర్త అన్నా హజారేకు మరోమారు బెదిరింపులు ఎదురయ్యాయి. రాజస్థాన్ లోని సికార్ పట్టణంలో నేడు జరగనున్న ఓ బహిరంగ సభలో హజారే పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాత్రికే ఆయన సికార్ చేరుకున్నారు. అయితే సికార్ లో హజారే బస చేసిన ఇంటి వద్దకు స్కూటర్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఓ లేఖను వదిలి వెళ్లాడు. దీనిని గమనించిన హజారే అనుచరుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘‘సికార్ కు మీరు రావాల్సింది కాదు’’ అంటూ హజారేను ఆ లేఖలో గుర్తు తెలియని దుండగులు హెచ్చరించారు. బెదిరింపుల లేఖ నేపథ్యంలో హజారేకు భద్రతను పెంచామని అదనపు ఎస్పీ ప్రకాశ్ కుమార్ చెప్పారు.