కేటీఆర్ పై శివాలెత్తిన జానా...‘నేనేంటో నీ అయ్యకు తెలుసు’అని వ్యాఖ్య

11-10-2015 Sun 08:04

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి శివాలెత్తిపోయారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఇటీవల తనపై కేటీఆర్ చేసిన ‘జానెడు’ కామెంట్లపై అదే జిల్లా కేంద్రంగా జానారెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బెత్తెడు పని చేయలేని కేటీఆర్ బారెడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయినా... తానేంటో కేటీఆర్ అయ్య కేసీఆర్ కు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నర్సంపేట రైతు భరోసా యాత్రలో భాగంగా నిన్న జానారెడ్డి ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేటీఆర్ ఇటీవల ఆత్మకూరు మండలంలో పర్యటిస్తూ... జానారెడ్డి జానెడు పని చేస్తడా? అని అన్నాడు. ఆ పదజాలంతో మీ రక్తం కుతకుతలాడుతోందని నాకు తెలుసు. అసలు ఆయన బెత్తెడు పని చేయగలడనే నమ్మకం ఎవరికైనా ఉందా? అందుకే బారెడు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నడు. బెత్తెడు పని చేయలేనోడు... జానెడు చెప్పినా, మూరెడు చెప్పినా ఒకటే. టీఆర్ఎస్ ప్రభుత్వం బెత్తెడు పనిచేయలేదనే విషయం మీకందరికీ త్వరలోనే రుజువు అవుతుంది. నర్సంపేట అడవుల్లో దొంగతనాలను అడ్డుకొనేందుకు అడవుల్లో తిరిగిన ఘనత నాది. మండల వ్యవస్థకు ఆద్యుడు జానారెడ్డి. రైతు సోదరులు అప్పులతో బాధ పడుతుంటే వ్యవసాయ మంత్రిగా వాటిని రద్దు చేసింది కూడా జానారెడ్డే. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగితే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు ఇప్పించింది కూడా జానారెడ్డే. ఇంత చేసినా జానారెడ్డి ప్రగల్భాలు పలకలేదు. మేనేజర్లను పెట్టుకుని పేపర్లలో రాయించుకోలేదు. జానారెడ్డి ఏం చేశాడో అతనికేం (కేటీఆర్) తెలుసు... నేనేంటో వాళ్ల అయ్యకు తెలుసు’’ అని జానారెడ్డి విరుచుకుపడ్డారు.