: కేఎస్ఆర్టీసీ బస్సులో ‘ఎర్ర’దండు... పట్టేసిన చిత్తూరు పోలీసులు

ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడి కోసం ఎంతగా చర్యలు తీసుకుంటున్నా నేరస్తుల్లో భయం పుట్టడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుని ఎర్రచందనాన్ని తరలించేస్తున్నారు. ఎక్కడో దాక్కుని స్మగ్లర్లు మంత్రాంగం నడిపిస్తుండగా, తమిళ కూలీలు మాత్రం బరి తెగిస్తున్నారు. నేటి ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సును తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు షాక్ తిన్నారు. 50 మంది పట్టే బస్సులో ఏకంగా 89 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగల కోసం చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవులకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే పక్కా సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు ఆ బస్సును చంద్రగిరి మండలం నేండ్రగుంటలో ఆపి తనిఖీ చేశారు. బస్సులో ఒకరిపై ఒకరు కూర్చున్న 89 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కిందకు దించిన పోలీసులు బస్సును తనిఖీ చేయగా, చెట్లను కోసేందుకు ఉపయోగించే రంపాలు, గొడ్డళ్లతో పాటు అడవుల్లో వంట చేసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో పాత్రలు కూడా బయటపడ్డాయి. దీంతో ‘ఎర్ర’ కూలీలను అరెస్ట్ చేసిన పోలీసులు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News