: ప్రయాణానికి సిద్ధమా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఈ పండగ సీజనులో ఎక్కడికైనా విహారయాత్రకు లేదా స్వగ్రామానికి వెళ్లాలని భావిస్తున్నారా? మీ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా, శ్రమ లేకుండా సాగాలని భావిస్తున్నారా? అయితే, బయలుదేరే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివి. * మీ బట్టలను మడతపెట్టే బదులు వాటిని రోల్ గా చుట్టండి. దీని వల్ల బట్టల మధ్య ఉండే గాలి తొలగడంతో పాటు ముడతలు కూడా పోతాయి. మరిన్ని బట్టలు పెట్టేందుకు వీలు కలుగుతుంది. * ఎన్ని రోజుల ప్రయాణమో చూసుకుని అందుకు తగ్గట్టుగా సాధ్యమైనన్ని తక్కువ బట్టలు ప్యాక్ చేసుకోవాలి. దీనివల్ల మోత బరువు తగ్గుతుంది. * మీకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను, అంటే విమానం టికెట్లు, బస తదితరాలకు సంబంధించిన వాటితో పాటు, మీకు అవసరమవుతాయని భావించిన దస్త్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో మెయిల్ చేసుకుని ఉంటే మంచిది. * డబ్బు తీసుకువెళుతున్నట్లయితే, దాన్ని చిన్న మొత్తాలుగా విభజించి రెండు, మూడు చోట్ల దాచాలి. * కొన్ని క్యారీ బ్యాగులు, న్యూస్ పేపర్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. వీటి అవసరం ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా రావచ్చు. * కొత్త వాటర్ బాటిల్ కొనే బదులు ఇంట్లోని ఖాళీ బాటిల్ వెంట తీసుకెళ్తే ఎంతో డబ్బు మిగులుతుంది. ముఖ్యంగా ఎయిర్ పోర్టుల్లో వందల కొద్దీ డబ్బు నీటి కోసం వెచ్చించే బదులు ఖాళీ బాటిల్ తీసుకెళ్తే మంచిది. నీటితో ఉన్న బాటిల్ ను సెక్యూరిటీ అనుమతించదు సుమా. నీరు లేకుండా ఉన్న బాటిల్ తీసుకువెళ్లి చెకిన్ తరువాత దాన్ని నింపుకోవచ్చు. * మీ ఫోన్ లో అవసరమనుకున్న యాప్స్ లోడ్ చేసుకోవాలి. మ్యాప్స్, రెస్టారెంట్లు, ఫ్లయిట్ లేదా ట్రైన్ ట్రాకర్లు వంటి ఎన్నో ప్రయాణాల్లో ఉపయోగపడే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. * ఏవైనా చిత్రాలను స్మార్ట్ ఫోన్లో తీయాలని భావిస్తే, ఓకే చోట ఫటా ఫటా పదో పదిహేనో క్లిక్స్ తీసి, ఆపై వాటిని ప్రయాణ సమయంలో చూస్తూ, నచ్చినవి ఉంచుకుంటే, మంచి ఫోటోలు వస్తాయి. ఫోన్లో స్పేస్ కూడా మిగులుతుంది. అదే ఒక్క ఫోటోనే తీసి, అది రాకుంటే మంచి అనుభూతిని పోగొట్టుకున్న బాధ కలుగుతుంది. * అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకుంటే మంచిది. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్, బాధ నివారిణులు, దగ్గు, జలుబు, తలనొప్పి తదితరాల నుంచి ఉపశమనం కలిగించే ఔషధాలకు మీ లగేజీలో స్థానం కల్పించాలి. ఇవన్నీ టవల్ పట్టే స్థానం కన్నా తక్కువలోనే ఇరికించేయొచ్చు. * మిగతా వారి లగేజీతో పోలిస్తే భిన్నంగా ఉండేలా మీ లగేజీ ఉంటే సులువుగా గుర్తించడానికి వీలు పడుతుంది. విమానాశ్రయాల్లో కన్వేయర్ బెల్టులపై ఒకరి లగేజీలను మరొకరు తీసుకువెళ్లిన సందర్భాలు వేలల్లో ఉన్నాయి. * వెంట కొంత ఆహారం తీసుకెళ్తే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఏమో ప్రయాణం ఆలస్యం కావచ్చు. లేదా దారి మధ్యలో అవాంతరం ఎదురవచ్చు. * ప్రయాణానికి సాధ్యమైనంత ముందుగా బస్టాండ్, రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం తప్పుతుంది. * ఎక్కడ ప్రయాణిస్తున్నా, ఏ ఊరిలో ఉన్నా మీ గురించిన సమాచారాన్ని స్నేహితులు, బంధువులతో రోజుకోసారన్నా పంచుకోడవం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, మీ ప్రయాణం మరింత ఆహ్లాదకరమవుతుంది... మధుర జ్ఞాపకంలా మిగులుతుంది!

More Telugu News