: ముందుగా ప్లాన్ చేసుకోలేదా... ఫర్లేదు బ్యాగులు సర్దేసుకోండి!

దైనందిన జీవితంలో పని ఒత్తిడి మధ్య శరీరం కాస్తంత విశ్రాంతిని కోరుకోవడం సహజమే. వారాంతం వచ్చి శుక్రవారం నాడు సెలవు దొరికితే, ఎక్కడికైనా వెళ్దామని భావించే కుటుంబాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వారాంతానికి అటూ ఇటుగా సెలవులు పెట్టుకుని దూరప్రాంతాలకు విహారం లేదా పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు పెట్టుకునే సమయంలో ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు టూర్ ఆపరేటర్లు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే, అన్ని వసతులూ సమకూర్చి అలసట లేని ప్రయాణాన్ని అందిస్తామని హామీ ఇస్తున్న సంస్థలు అనేకం సేవలందిస్తున్నాయి. "వారాంతాలకు తోడుగా ఒకటి రెండు సెలవులు పెట్టి మా వద్దకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కస్టమర్ల అవసరాలు, అభిరుచులను బట్టి ఎన్నో రకాల టూర్ ప్లాన్ లను మేము అందిస్తున్నాం" అని కాక్స్ అండ్ కింగ్స్, రిలేషన్స్ విభాగం హెడ్ కరణ్ ఆనంద్ వివరించారు. ఒక్క కాక్స్ అండ్ కింగ్స్ మాత్రమే కాదు, ఈ రంగంలో సేవలందిస్తున్న 'ఈజీగో వన్ డాట్ కాం', 'హోటల్స్ డాట్ కాం', వంటి ప్రైవేటు సంస్థలతో పాటు అన్ని రాష్ట్రాల టూరిజం విభాగాలు టూరిస్టులకు స్వాగతం పలికి సకల ఏర్పాట్లు చూస్తున్నాయి. మెట్రో నగరాలకు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న 20 వరకూ స్థలాలకు డిమాండ్ అధికంగా ఉంటోందని, మరింత దూరం ప్రయాణించాలని ఎవరూ భావించడం లేదని ఈజీగో వన్ డాట్ కాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీలూ సింగ్ వ్యాఖ్యానించారు. హోటల్ రూముల ముందస్తు బుకింగ్ ను సులభం చేశామని, ఆన్ లైన్ లేదా ఒక్క ఫోన్ కాల్ తో రూములను బుక్ చేసుకోవచ్చని, ఈ పండగ సీజన్, రానున్న గాంధీ జయంతి లాంగ్ వీకెండ్ సందర్భంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, ముంబై నగరాలకు ప్రయాణాలు అధికంగా జరగనున్నాయని హోటల్స్ డాట్ కాం సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ముంబై నుంచి మహాబలేశ్వరం, గోవాలకు, బెంగళూరు నుంచి మైసూరు, కొడైకెనాల్ ప్రాంతాలకు, చెన్నై నుంచి మహాబలిపురం, పాండిచ్చేరిలకు, ఢిల్లీ నుంచి షిమ్లా, కార్బెట్ ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తున్న వారు అత్యధికంగా ఉంటున్నారని సమాచారం. వీటితో పాటు రాజస్థాన్ లోని జైపూర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్, అజ్మీర్, పుష్కర్, కేరళలోని కొచ్చి, మున్నార్, తేక్కడీ, అలెప్పీలకు, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖపట్నం, అరకు ప్రాంతాలకు ఈ సీజనులో అధిక టూరిస్టుల తాకిడి ఉండవచ్చని అంచనా. ఈ ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తే, ముందుగా ప్రణాళికలు వేసుకుని టికెట్ల కోసం పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ప్రయాణాలను మరింత ఆహ్లాదకరం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని టూరిజం రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు. అప్పటికప్పుడు ప్రయాణాలు పెట్టుకుని టూరిజం ఆపరేటర్లను సంప్రదించాలని భావిస్తున్నా, సాధ్యమైనంత వరకూ, కనీసం కొద్ది రోజుల ముందుగానైనా వివిధ వెబ్ సైట్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి, చౌక ప్యాకేజీలను వెతికేందుకు కొంత సమయం వెచ్చిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.

More Telugu News