: ఈ చిన్న అలవాట్లతో ఆఫీసులో మీపై సదభిప్రాయం!

మనం తెలియకుండా చేసే కొన్ని పనులు ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కొన్ని విషయాల్లో తెలీక చేసే తప్పులు వారిపై ఉండే మంచి అభిప్రాయానికి బీటలు వేస్తాయి. ఈ కింది చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే, మిగతా అందరితో పోలిస్తే, మీరు ప్రత్యేకంగా నిలవడంతో పాటు అందరితో గౌరవించబడతారు. * ఆఫీసుకు సమయానికి చేరే క్రమంలో ఇంటి నుంచి కార్యాలయం వరకూ ట్రాఫిక్ లో పడుతూ, లేస్తూ నిదానంగా వచ్చే ఉద్యోగులు, లిఫ్ట్ దగ్గర మాత్రం త్వరపడతారు. ఎక్కువ మంది లిఫ్ట్ దగ్గర కనిపిస్తే, అందరినీ తోసుకుంటే వెళ్లేవారే అధికం. అలా చేయద్దు. పెద్దలు, సీనియర్ అధికారులు తొలుత వెళ్లేందుకు సహకరించాలి. నాలుగైదు అంతస్తులైతే, మెట్లెక్కి వెళ్తే ఇంకా మంచిది. మరీ ఎక్కువ ఫ్లోర్లు వెళ్లాల్సి వస్తే, కాసేపు వేచి చూస్తే, మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. * కాసేపు రిలాక్స్ కావడం కోసమో, లేదా పని లేదులే అనుకొనో ఇంటర్నెట్ లో పడిపోయి లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగులు, ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టి పాటలు వినడం వంటివి చేస్తుంటారు. ఈ తరహా చర్యలు మీరు పని సరిగ్గా చేయడం లేదన్న అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు కలిగిస్తాయి. ఈ చర్యలకు దూరంగా ఉంటే మంచిది. సమయం మిగిలిందనుకుంటే, తదుపరి పనులపై దృష్టిని సారించడం, ఇంటర్నెట్ లో కావాల్సిన సమాచారాన్ని వెతుకుతూ, తెలీని విషయాలు తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకునేందుకు కృషి చేయాలి. * ఆఫీసుల్లో వాటర్ కూలర్ల దగ్గర చేసే పనులు మంచి లేదా చెడు అభిప్రాయాలు కలిగేందుకు దోహదపడతాయి. కూలర్ల వద్ద స్టీల్, ప్లాస్టిక్ గ్లాసులు వున్నప్పుడు, నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకూడదు. సగం తాగి, మిగిలిన నీరు పారబోయకుండా గ్లాసు అక్కడే ఉంచి వెళ్లకూడదు. * సెల్ ఫోన్ రింగ్ టోన్ సాధ్యమైనంత మృదువుగా వుండేలా చూసుకోవాలి. ఫోన్ మోగితే, ఇతరులు ఇబ్బందిపడేలా ఉండకూడదు. కంప్యూటర్ టేబుల్ పై పుస్తకాలూ, కాగితాలు, ఇతర స్టేషనరీ సామానులను చక్కగా అమర్చుకోవాలి. దీనివల్ల మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారని నలుగురికీ తెలుస్తుంది. * ఇతర ఉద్యోగుల వస్తువు అవసరమైతే, వారిని అడిగి మాత్రమే తీసుకోవాలి. పని పూర్తయ్యాక దాన్ని తిరిగి ఇచ్చి వేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, మీపై ఏర్పడిన సదభిప్రాయం కూడా పోతుందని గుర్తుంచుకోవాలి.

More Telugu News