: వయసు పెరగకుండానే తెల్ల జుట్టు వస్తోందా?... తగ్గిపోతుందిలా!

మూడు పదుల వయసు కూడా దాటకుండానే తెల్లజుట్టు వచ్చేస్తోందా? దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబ పరమైన జన్యు లోపాలు, పని ఒత్తిడి, రక్తహీనత, శరీరంలో విటమిన్ల లోపం వంటి కారణాలతో తెల్ల జుట్టు వస్తుంటుంది. జుట్టుకు రంగు వేసుకుంటే అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రొడక్టులతోనే ఇంట్లోనే చికిత్స ద్వారా తెల్లజుట్టును తగ్గించుకోవచ్చు. ఎలాగంటే... కొబ్బరినూనె, కరివేపాకు: నిత్యమూ కొబ్బరినూనె తలకు పెట్టుకోవడం వల్ల అది సహజ కండిషనర్ గా పనిచేస్తుంది. పొడిబారిన కురులను మృదువుగా మారుస్తుంది. ఇక కరివేపాకులోని బీ-విటమిన్ జట్టుకు నల్లదనాన్ని పెంచుతుంది. ఇందులోని బీటా కెరోటిన్ సైతం ఇందుకు ఉపకరిస్తుంది. కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి వేడి చేసి, కరివేపాకు నల్లగా మారాక దింపేసి తలకు మృదువుగా మర్దన చేసుకుని, ఆపై షాంపూతో కడిగేయాలి. ఇలా మూడు వారాలు చేసి చూడండి! మెంతులు, ఉసిరి: మెంతుల్లో ఐరన్, పొటాషియంలతో పాటు ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇక ఉసిరిలోని విటమిన్ సి తలపై ఉన్న తెల్ల వెంట్రుకలు మరింత బలహీనపడి రాలిపోకుండా చేస్తుంది. మెంతుల్లోని సద్గుణాల కారణంగా జుట్టు సహజసిద్ధంగా నల్లబడుతుంది. కొబ్బరినూనెలో ఐదు ఎండు ఉసిరికాయలు వేసి వేడి చేసి ఐదు నిమిషాల తరువాత మెంతుల పొడిని కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రిళ్లు తలకు రాసుకుని మర్నాడు కడిగేసుకుని చూడండి... త్వరలోనే తెల్లజుట్టు సైతం నల్లగా మారడాన్ని గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News