: మరో పదేళ్లలో సముద్రం పాలు కానున్న గ్రామం

2025 నాటికల్లా అమెరికాలోని ఓ గ్రామం సముద్రం పాలుకానుంది. పచ్చని చెట్లు, వెన్నెల్లో బంగారంలా మెరిసే ఇసుకతిన్నెలు, అందమైన సముద్ర తీరం... ఇదీ ఆ గ్రామ స్వరూపం. సముద్రానికి 400 మీటర్ల ఎత్తునున్న ఈ గ్రామాన్ని అభివృద్ధి మాటున ప్రపంచం ముంచేసింది. పరిశ్రమలు విడుదల చేస్తున్న గ్రీన్ హౌస్ వాయువుల వల్ల రుతువులు మారుతున్నాయి. హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల వల్ల ఆర్కిటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలో అలాస్కాలో ఉన్న కివలిన గ్రామం ప్రమాదంలో పడింది. ఆ గ్రామాన్ని పరిశీలించిన ఆర్మీ ఇంజనీర్లు 2025 నాటికి ఆ గ్రామం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతుందని తేల్చారు. దీంతో ఆ గ్రామానికి అలస్కా ప్రభుత్వం నిధుల కేటాయింపు నిలిపేసింది. 400 మంది కలిగిన ఆ గ్రామానికి రక్షణగా 2011లో ఆటుపోట్లను తట్టకునేందుకు ఓ గోడను నిర్మించగా కేవలం ఐదేళ్లలో ఆ గోడ పగిలిపోయింది. మొన్నటి వరకు పండ్ల తోటలు పెంచుకుంటూ, తిమింగలాలను వేటాడుతూ జీవించిన అక్కడి ప్రజలు ఇప్పుడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. 1847లో ఈ దీవిని రష్యా కనుగొనగా, 1960లో అమెరికా ప్రభుత్వం ఎయిర్ స్ట్రీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భూతాపంపై జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు అలస్కాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెళ్లారు. భూతాపానికి గురవుతున్న తమ గ్రామాన్ని పట్టించుకుంటారని అక్కడి వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News