: ‘టాటూ’తో హెచ్ఐవీ, హెపటైటిస్ ముప్పు... తేల్చిచెబుతున్న బ్రిటన్ అధ్యయనం

‘‘పచ్చబొట్టూ చెరిగిపోదులే...’’ అంటూ అప్పుడెప్పుడో తెలుగు సినీ గేయ రచయిత జనరంజకమైన పాట రాశారు. ఆధునిక కాలంలో ‘టాటూ’ గా హల్ చల్ చేస్తున్న పచ్చబొట్టు శరీరంపై మరక వేయడంతో పాటు జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు పరిశోధకులు. మైనారిటీ తీరని పిల్లలకు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని బ్రిటన్ కు చెందిన ‘విగాన్ కౌన్సిల్’ నిర్వహించిన ఓ సర్వే తేల్చిచెబుతోంది. వివరాల్లోకెళితే... టాటూలను మైనారిటీ తీరని పిల్లలకు వేయకూడదు. అంతేకాక టాటూ వేయించుకున్న వారు ఏడాది వరకు రక్తదానం చేయకూడదు. అయితే నగరాల్లో టాటూ వేలం వెర్రి నానాటికీ అధికమవుతోంది. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా గుట్టుమట్టుగా 13, 14 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా టాటూలు వేయించుకుంటున్నారు. వీరి చాటుమాటు వ్యవహారానికి వత్తాసు పలుకుతున్న టాటూ కళాకారులు జేబులు నింపుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్పించి జాగ్రత్తలు పాటించడం లేదు. టాటూ వేసే సమయంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో సూది వినియోగించాల్సి ఉంది. అయితే టాటూ కళాకారులు ఈ విధానాన్ని అంతగా పట్టించుకోవడం లేదట. దీంతో మైనర్లకు హెచ్ఐవీ, హెపటైటిస్ తరహా ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని ‘విగాన్’ కౌన్సిలర్ కేత్ కన్లీఫ్ చెబుతున్నారు. విధి విధానాలు పక్కాగా అమలు చేయడం, టాటూలపై మైనర్లకు తల్లిదండ్రులు అవగాహన కల్పించడమే ఈ ముప్పు నివారణ మార్గాలని కేత్ వాదిస్తున్నారు.

More Telugu News