: వైఫై సిగ్నల్ సమస్యలా?... ఇలా చేస్తే తొలగుతాయి!

ఇటీవలి కాలంలో ఆఫీసు కార్యాలయాలతో పాటు ఇళ్లలోనూ వైఫై రూటర్లు వచ్చి చేరిపోయాయి. ఇదే సమయంలో సిగ్నల్స్ సరిగ్గా అందక ఇబ్బందులూ పెరిగిపోయాయి. ఇళ్లు లేదా కార్యాలయాల్లో అమర్చుకున్న వైఫై రూటర్లలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్... రూటర్ ను సరైన స్థలంలో పెట్టాలి: రూటర్ల నుంచి రేడియో సిగ్నల్స్ వెలువడుతుంటాయి. కాబట్టి వీటిని సరైన స్థలంలో అమర్చడం ఎంతో ప్రధానం. ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్ లు తదితరాలకు వీటిని దూరంగా ఉంచాలి. ఓ గోడకు అమర్చడం కన్నా సెంటర్ పాయింట్ లో ఉండేట్టు చూడటంతో పాటు నేలకు సాధ్యమైనంత ఎత్తులో ఉంటే మంచిది. దీని వల్ల సిగ్నల్స్ నలువైపులా విస్తరిస్తాయి. డెడ్ స్పాట్స్ గుర్తించాలి: సెల్ ఫోన్లకు సిగ్నల్స్ వస్తున్నప్పటికీ, వైఫైకి సరిపడేంతగా సిగ్నల్స్ లభించని ప్రాంతాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి ప్లేస్ లో రూటర్ అమరిస్తే తరంగాలను అందుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు వైఫై ఇన్ స్పెక్టర్, నెట్ స్టంబ్లర్, వైఫై అనలిటిక్స్ టూల్ తదితరాలను వాడి సిగ్నల్స్ ఎక్కడ అధికంగా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించవచ్చు. చానల్ మార్చి చూడండి: వైఫై రూటర్ కు సమీపంలోనే మరో రూటర్ ఉన్నా సిగ్నల్స్ లో సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో చానల్ ఫ్రీక్వెన్సీని మారిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. రూటర్ డీఫాల్ట్ సెట్టింగ్ పేజీలోకి వెళ్లి 1, 6, 11 చానల్స్ లో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా గరిష్ఠ సిగ్నల్స్ వచ్చేలా చూడవచ్చు. ఇరుగు పొరుగు వారిపై ఓ కన్నేయండి: మీ వైఫై సిగ్నల్స్ వాడుతూ ఇరుగు పొరుగు వారు ఇంటర్నెట్ వాడుతున్నా మీకు సిగ్నల్స్ తగ్గిపోతాయి. వాడుతున్న డివైస్ ల సంఖ్య పెరిగితే సిగ్నల్స్ బలం తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే, రూటర్ ఐపీ అడ్రస్ లోకి 'కమాండ్ ప్రాంప్ట్' విధానంలోకి వెళ్లి సెక్యూరిటీ ప్రొటోకాల్స్ మార్చాల్సి వుంటుంది. కమాండ్స్ తెలుసుకుంటే ఇది చాలా సులభం. ప్రొటోకాల్స్ మార్చాలంటే... * రూటర్ ను కనెక్ట్ చేసిన కంప్యూటర్ నుంచి 'win+R' ప్రెస్ చేసి, ఆపై వచ్చిన విండోలో 'cmd' అని టైప్ చేయాలి. * నల్లటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ 'ipconfig' అని టైప్ చేస్తే వైఫై ఐపీ అడ్రస్ వస్తుంది. * ఆ ఐపీ అడ్రస్ తో రూటర్స్ సెట్టింగ్స్ అడ్మిన్ పేజీలోకి లాగిన్ అయితే, ఐపీ అడ్రస్ సహాయంతో వైఫై సిగ్నల్స్ పొందుతున్న డివైజ్ ల వివరాలు కూడా తెలుస్తాయి. * సెక్యూరిటీ ప్రొటోకాల్ మార్చాలని భావిస్తే 'WAP2-AES'కు మారిపోయి పాస్ వర్డ్ రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ గా రీబూట్ చేయండి: సిగ్నల్స్ బలహీనంగా ఉన్నాయని భావిస్తే ఒక్కసారి రూటర్ ను రీబూట్ చేసి చూడండి. సిగ్నల్స్ వాడకపోయినా, రూటర్ ను స్విచ్ ఆఫ్ చేయకుంటే, నిదానంగానైనా వాటి బలం తగ్గిపోతుందని గమనించండి.

More Telugu News