: సెల్ఫీల మోజులో మోడువారుతున్న భారత యువత!

భోజనాల సమయంలో, నిద్రపోయే ముందు, స్నానానికి వెళ్లేటప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఆఖరికి కష్టకాలంలో, చివరికి చెడు సందర్భాల్లో సైతం స్మార్ట్ ఫోన్ వాడుతూ సెల్ఫీలు దిగుతున్నారా? వాటిని స్నేహితులకు పంపుతూ ఆనందిస్తుంటారా? ఈ 'సెల్ఫీయిజం'కు స్వస్తి పలకండి. ఈ తరహా చర్యలు చేస్తున్న పిల్లలు మీకున్నారా? అయితే జాగ్రత్తపడండి. సెల్ఫీల మోజు యువతీ యువకుల్లోని సున్నితత్వాన్ని చంపేసి వారి మనసులను మొద్దుబారేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ ఫోన్లు, సెల్ఫీ స్టిక్ లు యువత జీవితాన్ని నెమ్మదిగా పతనం వైపు నెడుతున్నాయని అంటున్నారు. ఇటీవల ఓ సైకాలజీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో అధిక సంఖ్యలో సెల్ఫీలను పోస్ట్ చేస్తున్న వారు తమ అహంకారాన్ని, ద్వేషాలను పెంచుకుంటున్నారని వెల్లడైంది. సెల్ఫీలు యువతను మానసికంగా దెబ్బతీస్తున్నాయని ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ పారీఖ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల అమితాబ్ బచ్చన్, తన స్నేహితుని అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఎంతో మంది అభిమానులు వచ్చి సెల్ఫీల కోసం పోటీ పడి ఆయనను అసహనానికి గురి చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు కూడా. ఓ యువకుడు చావుకు దగ్గరగా ఉన్న తాత పక్కన వెకిలి నవ్వు నవ్వుతూ సెల్ఫీ దిగితే, తల్లి స్నేహితురాలికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంటే, ఆమెతో సెల్ఫీ దిగి పంచుకున్నాడో టీనేజర్. సెల్ఫీల మోజులో పడి రాతి గుండెలుగా మారుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నదని, దీనికి అడ్డుకట్ట పడాలని ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ మాధురీ సింగ్ అన్నారు.

More Telugu News