: వ్యాయామం చేసే ముందు ఇవి తింటే మరింత శక్తి!

రోజుంతా పనిచేయాలంటే శరీరానికి ఎంతో శక్తి అవసరం. ఇక శరీరం ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం ఇంకా అవసరం. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే శరీర సౌష్టవం ఎంతో ఉపకరిస్తుంది. ఎంత ఆహారం తీసుకున్నా ఎక్కడో ఒకచోట అలసి పోవడం సహజమే. అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ తదితరాలను అందించే ఆహారం అందరికీ అందుబాటులోనే ఉందని అంటున్నారు నిపుణులు. వీటిని వ్యాయామం చేసే ముందు తీసుకుంటే, మరింత శక్తి లభించి, సులువుగా వర్కౌట్స్ పూర్తి చేయగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండు: అరటిపళ్లలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, పొటాషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సహజ శక్తిని శరీరానికి అందివ్వడంలో ముందు నిలిచేవి ఇవే. ఏ ఫిట్ నెస్ నిపుణుడిని అడిగినా, ఇదే విషయం చెబుతారు. వ్యాయామానికి వెళ్లడానికి 30 నిమిషాల ముందు అరటిపళ్లు తినాలి. ఓట్స్: ఓట్స్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి వ్యాయామంలో రక్త ప్రసరణ అదుపు చేస్తాయి. శరీరంలో చక్కెర నిల్వలను పెరగనీయవు. స్టెరోటోనిన్ హార్మోను నిల్వలను పెంచుతాయి. ఓట్స్ ఇచ్చే శక్తి మరింత సమయం పాటు నిలుస్తుంది. తాజా పళ్ల రసాలు: వ్యాయామాలకు ముందు ద్రాక్ష, స్ట్రాబరీ వంటి పళ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరంలో నాణ్యమైన ప్రొటీన్లు చేరుతాయి. ఇవి సులువుగా జీర్ణం అవుతాయి కూడా. గుడ్డు సొన: కోడి గుడ్డులోని సొనను జిమ్ కు వెళ్లే ముందు తీసుకుంటే మంచిది. ఎందుకంటే, సొనలోని కొవ్వు పదార్థాలు నిదానంగా జీర్ణమవుతాయి. అందువల్ల నెమ్మదిగా వ్యాయామాలు పూర్తి చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. వీటిల్లోని అమీనో ఆమ్లాలు కండరాల కణజాలం గట్టి పడేందుకు సహకరిస్తాయి. పెరుగు: మిగతా పదార్థాలతో పోలిస్తే పెరుగులో రెట్టింపు ప్రొటీన్లుంటాయి. ముఖ్యంగా గ్రీక్ యోగర్ట్ లో సోడియం శాతం చాలా తక్కువగా ఉంటుంది. పెరుగును మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తో కలిపి తీసుకుంటే మంచిది. డ్రై ఫ్రూట్స్: జిమ్ కు వెళ్లే ముందు ఏ ఆహారమూ సిద్ధంగా లేకుంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి శరీరానికి ఇన్ స్టంట్ శక్తిని ఇస్తాయి. అయితే, వీటిని తీసుకునే ముందు ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తుందన్న విషయాన్ని పరిశీలించాలి. కాఫీ: అరగంట వ్యాయామానికి వెళ్లడానికి గంట ముందు కాఫీ తీసుకుంటే, కండరాల నొప్పులు తగ్గుతాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ రీసెర్చ్ కనుగొంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరిచేందుకు కెఫిన్ సహకరిస్తుంది. కణజాలానికి సరైన రీతిలో ఆక్సిజన్ సరఫరాకు సహకరిస్తుంది.

More Telugu News