: పాతికేళ్లలోపే తండ్రయ్యారా? అయితే ముప్పున్నట్టే...!

పాతికేళ్లలోపు తండ్రైతే వారి ప్రాణాలకు ముప్పుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఫిన్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయని పరిశోధకులు తెలిపారు. ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన వివరాల ప్రకారం... యుక్త వయసులోనే తండ్రయితే...తొందరగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల లోపు పిల్లల్ని కంటే దాని ప్రభావం మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానిని తట్టుకోలేకపోతే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని వారు వెల్లడించారు. యవ్వనంలో తండ్రయ్యేవారి ఆయుష్షును మానసిక, శారీరక ఒత్తిడులు హరిస్తున్నాయని వారు పేర్కొన్నారు. మధ్యవయసు మరణాలపై చేసిన పరిశోధనల్లో...మధ్యవయసు మరణాలకు, చిన్న వయసు పితృత్వానికి సంబంధం ఉందని వెల్లడైందని వారు తెలిపారు. 22 నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని కన్నవారి మరణాలతో పోలిస్తే, 25 ఏళ్ల తరువాత తండ్రి అయినవారు ఎక్కువ కాలం బతికినట్టు పరిశోధకులు వెల్లడించారు. మొదటి బిడ్డను కన్న వయసు, పిల్లల సంఖ్య, వైవాహిక స్థితి తదితరాలు పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు. చిన్న వయసులోనే తండ్రయిన కారణంగా పదేళ్లలో ఒకటి నుంచి 20 మంది వరకు అర్ధాయుష్కులవుతున్నారని పరిశోధన తేల్చింది. 21 శాతం మంది తీవ్ర గుండెజబ్బులు, 16 శాతం మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారని తెలిపింది. 25 ఏళ్లకు ముందే తండ్రి అయితే 40 నుంచి 45 ఏళ్ల మధ్య మరణించే ప్రమాదం ఉందని పరిశోధన వెల్లడించింది. అయితే 25 ఏళ్లలోపు తండ్రి అయిన వ్యక్తి కుటుంబ పరిస్థితులు, ఇతర సామాజిక పరిస్థితులపై పరిశోధనలు చేయాల్సి ఉందని, అప్పుడే పూర్తి ఫలితాలు వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

More Telugu News