: ఒత్తిడి కారణంగా అలసిపోయారా? ఇలా చేస్తే అలసట మాయం!

అసలే పుష్కరాల సమయం, గంటల కొద్దీ ట్రాఫిక్ జాం, ఆపై నదీ స్నానం, సమీపంలోని దేవాలయాల్లో గంటల నిరీక్షణ, ఆపై ఆపసోపాలు పడుతూ ఇల్లు చేరే వరకు సహజంగానే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఇటువంటి సమయంలో అలసిపోవడం సహజం. ఒక్క ప్రయాణాలు చేసి వచ్చినవారే కాదు, రద్దీ రహదారులపై ఆఫీసులకు వెళ్లి కష్టపడి ఇల్లు చేరే ఉద్యోగులు, క్షణం తీరికలేని ఇంటి పనుల్లో బిజీగా ఉండే గృహిణులు అలసటకు గురికావడం సహజమే. అటువంటి పరిస్థితుల్లో అలసట నుంచి బయట పడటానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. వీటిని ఇంట్లోనే ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు. అవి ఏంటంటే... ప్రయాణంలో భాగంగా ఎక్కువ సమయం పాటు కదలకుండా కూర్చోవడం, ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చొని పనిచేయడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వస్తాయి. వీటి నుంచి సత్వర ఉపశమనం కలగాలంటే, మెగ్నీషియం అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీడిపప్పు తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. అలసట అధికంగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. ప్రయాణం వల్ల కలిగిన అలసటను తొలగించుకునేందుకు అరోమా నూనెలను వాడాలి. కండరాల నొప్పులు అధికంగా ఉన్న చోట ఈ నూనెలతో నెమ్మదిగా మర్దనా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. లావెండర్, అల్లం, మిరియాల నూనెలు వాడి మంచి ఫలితాలు పొందవచ్చు. ఓ బకెట్ వేడి నీళ్లలో గుప్పెడు ఎప్సంసాల్ట్ కలిపి, స్నానం చేయడం వల్ల కూడా ఒంటి నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రయాణాల తరువాత వెంటనే దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎప్సంసాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే మంచిది. ఇక అన్నిటికన్నా సులువైన మరో పద్ధతి 'కోల్డ్ థెరపీ'. ఇందులో భాగంగా, ఓ టవల్ లేదా మెత్తని గుడ్డలో కొన్ని ఐసు ముక్కలు వేసి నొప్పిగా ఉన్నచోట సున్నితంగా రాయాలి. ఐస్ నుంచి అందే చల్లదనంతో రక్తప్రసరణ వేగం పెరిగి సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. మీకు ఈసారి అలసట లేదా ఒత్తిడి వచ్చిందనిపించినప్పుడు వీటిల్లో ఏదో ఒకటి చేసి సత్వర ఉపశమనం పొందేందుకు యత్నించండి.

More Telugu News