: ఏలియన్ల కోసం ఖరీదైన అన్వేషణ... ముందుకొచ్చిన రష్యా కుబేరుడు

అనంత విశ్వంలో మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉన్నారా? అన్న ప్రశ్న ఎన్నో ఏళ్ల నుంచి మానవుడిని తొలుస్తూనే ఉంది. రోదసిలో సుదారానికి వెళ్లగలిగే సాధన సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం మానవుడికి ప్రతిబంధకంగా మారింది. ఏలియన్లు (గ్రహాంతర జీవులు) తప్పక ఉంటారన్న నమ్మకం మాత్రం మనిషిని పరిశోధనలకు పురిగొల్పుతూనే ఉంది. స్టీఫెన్ హాకింగ్ వంటి విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సైతం గ్రహాంతర జీవులు ఉండొచ్చన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హాకింగ్ మహాశయుడి నమ్మకం ఓ రష్యా బిలియనీర్ లో ఉత్సాహం కలిగించింది. ఈ నేపథ్యంలో, లండన్ లోని రాయల్ సొసైటీలో తొలి అడుగు పడింది. ఏలియన్ల అన్వేషణకు ఉద్దేశించిన 'బ్రేక్ త్రూ లిజన్' ప్రాజెక్టును హాకింగ్ సోమవారం ఆవిష్కరించారు. దీనికోసం 100 మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు రష్యా జాతీయుడైన యూరి మిల్నర్ అనే వ్యాపార దిగ్గజం సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆవిష్కరణ సందర్భంగా హాకింగ్ మాట్లాడారు. "అనంత విశ్వంలో జీవం ఉండొచ్చు. అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట మనకంటే తెలివైన వాళ్లు ఉండి, మన జీవితాలను గమనిస్తూ ఉండొచ్చు. భూమికి ఆవల జీవం ఉందేమో అని కనుగొనేందుకు ఇదే సరైన తరుణం. మనం బతికే ఉన్నాం, మనం తెలివైనవాళ్లం, మనం తప్పక తెలుసుకోవాలి" అని పిలుపునిచ్చారు.

More Telugu News