: కాలుష్య భారతావనిలో స్వచ్ఛమైన గాలి మీ ఇంట్లోకే వస్తుంది... ఎలాగంటే...!

ఇంట్లో కాలుష్యం, వీధిలో కాలుష్యం... కాలు బయటపెడితే ఎన్నో చోట్ల ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. వాహనాలపై వెళుతుంటే ఇక చెప్పే అవసరమే లేదు. ప్రాణాంతక కార్బైన్ మోనాక్సైడ్ ను పీల్చక తప్పని పరిస్థితి. ఈ తరుణంలో ఇంట్లో సులువుగా పరిశుభ్రమైన గాలిని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఏం చేయాలంటే... ఇంట్లోనే చిన్న చిన్న మొక్కలను పెంచడంద్వారా, బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికారక వాయువులను దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల పర్ఫ్యూములు, హెయిర్ స్ప్రేలు, ఫర్నీచర్ పాలిష్ లు, సిగరెట్ పొగ, ప్లాస్టిక్ వస్తవుల నుంచి వెలువడే రసాయన వాయువులను చిన్న చిన్న చెట్లు పీల్చుకుంటాయి. తద్వారా తలనొప్పి, నరాల బలహీనత, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలోవెరా, రబ్బర్ ప్లాంట్ తదితరాలు ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఎన్నో వాయువుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. ఇక ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం మూలంగా ఫార్మల్ డీహైడ్, పోలీన్, అలర్జన్స్, దుమ్ము, ధూళి కణాలు దరిచేరవు. ఇక ఇంట్లోకి వెళ్లే ముందే మీ షూస్ తీసివేయాలి. దీనివల్ల బయటి మట్టి, దుమ్ము ఇంట్లోకి చేరకుండా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో చెప్పులు వాడాల్సి వస్తే అందుకు వేరే జత ఉపయోగించాలి. రూం ఫ్రెష్ నర్లు, ఏరోసోల్ తదితరాలను వినియోగించరాదు. సాధ్యమైనంత వరకూ కొవ్వొత్తులను వాడకుండా ఉంటేనే మంచిది. నెయిల్ పాలిష్ రిమూవర్లు వినియోగించాల్సి వస్తే ఇంటి బయట వాడాలి. కార్పెట్లు, దుప్పట్లు వంటి వాటిని ఎప్పటికప్పుడు హెచ్ఈపీఏ (హై-ఎఫిషియన్సీ పర్టికులేట్ ఎయిర్) ఫిల్టర్లను వాడి శుభ్రపరుస్తుండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ధూమపానం చేయకూడదు. ఒక్క సిగరెట్ తాగినా కూడా అది ఇంట్లోని వారందరి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది సరికదా, వంద మొక్కలున్నా సిగరెట్ వదిలే విషపూరిత వాయువులను పూర్తిగా నాశనం చేయలేవని గుర్తెరగాలి. ఇంట్లోని గోడలకు పెయింట్ వేయాల్సి వస్తే పర్యావరణ స్నేహపూర్వక రంగులను వాడాలి. వీటన్నింటితో పాటు గదిలోకి గాలీ, వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు, తలుపులూ ఏర్పాటు చేసుకుంటే, మీ ఇంట్లో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆనందమయ జీవనాన్ని గడపవచ్చు.

More Telugu News