: 'మనసు చదివే కార్లు' త్వరలోనే వస్తాయట!

కార్ల తయారీ దిగ్గజాలు సరికొత్త టెక్నాలజీపై కసరత్తులు చేస్తున్నాయి. డ్రైవర్ల మనసును చదవడం, వారి ఆరోగ్యాన్ని అంచనా వేయడం, వారి చర్యలను ముందే పసిగట్టడం వంటి అంశాలను ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యం చేసేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. జాగ్వార్ సంస్థ తన కార్లను మరింత స్మార్ట్ గా, మరింత భద్రతతో రూపొందించేందుకు శ్రమిస్తోంది. డ్రైవర్ రోడ్డుపై దృష్టి పెడుతున్నాడా? లేక, పగటి కలలు కంటున్నాడా? అని తెలుసుకునేందుకు వీలయ్యే సాంకేతిక పరిజ్ఞానంపై జాగ్వార్ పరిశోధన చేస్తోంది. అతని మానసిక స్థితిని గుర్తించడం ద్వారా అప్రమత్తం చేసేందుకు వీలుంటుందన్నది జాగ్వార్ యోచన. వ్యక్తి మెదడులోని తరంగాలను పరిశీలించడం ద్వారా అతను అలసిపోయాడా? లేక, పరధ్యానంలో ఉన్నాడా? అన్నది కనిపెట్టేయవచ్చట. ఇలాంటిదే మరో ప్రాజెక్టు కూడా పరిశోధన దశలో ఉంది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతుంటే అతడిని హెచ్చరించడానికి, లేక, మరో కారుకు సమీపంలోకి వెళ్లినప్పుడు ప్రమాదాన్ని నివారించడానికి వైబ్రేషన్లు పంపుతారట. ఇవన్నీ సాకారమై అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. డ్రైవర్ లేని కార్లను రూపొందించేందుకు ఓ వైపు పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతుండగా, ఇప్పుడు ఈ నూతన టెక్నాలజీ కోసం పేరున్న సంస్థలు రంగంలోకి దిగడం ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News