: క్లాత్ లో కంప్యూటర్లు, గాడ్జెట్లు... దారపు పోగులే వైర్లు!

శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీకి మెరుగులు దిద్దుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వస్త్రం (క్లాత్)లోనూ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చొప్పించేందుకు వీలవుతుంది. అంటే, ఇకపై కంప్యూటర్లను ధరించవచ్చన్నమాట. వస్త్రంలోని దారపు పోగుల్లో పారదర్శక, సరళమైన గ్రాఫేన్ ఎలక్ట్రోడ్ లను పొందుపరుస్తారు. తద్వారా, క్లాత్ లో కంప్యూటర్లు, ఫోన్లు, ఎంపీ3 ప్లేయర్ల సాంకేతిక వ్యవస్థలను ఇమిడ్చేందుకు వీలవుతుంది. ఎక్సెటెర్ యూనివర్శిటీ, ఏవీరో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో పాలుపంచుకుంటున్నారు. దారపు పోగులో ఓ టెక్స్ టైల్ ఎలక్ట్రోడ్ ను పొందుపరచవచ్చన్న దానికి ఇది తొలి ఉదాహరణ అని ఎక్సెటెర్ వర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మోనికా క్రాసియన్ తెలిపారు. వైకల్యం ఉన్నవారికి అవసరమైన టెక్స్ టైల్ జీపీఎస్, బయోమెడికల్ మోనిటరింగ్, పర్సనల్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ పరికరాలను ఈ టెక్నాలజీ సాయంతో తయారు చేయవచ్చని వివరించారు. అణు మందంలో ఉన్న గ్రాఫేన్ అత్యంత పలుచని పదార్థం. విద్యుత్ వాహక సామర్థ్యం ఉన్న ఈ పదార్థం చాలా సరళమైనది, అదే సమయంలో, దృఢమైన పదార్థాల్లో ఒకటి. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ఈ పరిశోధన తాలూకు విశేషాలను వివరించారు.

More Telugu News