: కొవ్వు పదార్థాలు లాగించేస్తున్నారా?... అయితే, మీరు ప్రమాదం అంచున ఉన్నట్టే!

పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్లు, పరిమితికి మించిన కొవ్వున్న పదార్థాలు లాగించేస్తున్నారా?... అలా తింటే స్థూలకాయం, రక్తపోటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకదా? అయితే, తాజా పరిశోధనల్లో మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. పరిమితికి మించిన కొవ్వున్న ఫుడ్ అతిగా తీసుకుంటే, ఏకంగా మెదడు ఆలోచన స్థాయిలో నిలకడ తప్పుతుందని, మానసిక వైకల్యం తలెత్తి, తీవ్ర ఒత్తిడి తప్పదని పరిశోధకులు వెల్లడించారు. పరిమితికి మించిన కొవ్వున్న ఆహారపదార్థాలు తినే వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుందని, మెదడువాపు వ్యాధి కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని వారు సూచించారు. ఎలుకలపై చేసిన పరిశోధనలో దీనిని గుర్తించినట్టు లూసియానా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు తెలిపారు. కొవ్వుతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల ఏర్పడే అనర్థాలు అనే అంశంపై చేసిన పరిశోధనల వివరాలను బయోలాజికల్ సైకియాట్రి అనే జర్నల్ లో ప్రచురించారు. నాడీ వ్యవస్థపై కొవ్వు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపినట్టు గుర్తించామని వారు వెల్లడించారు. జీర్ణాశయం నుంచి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో కొవ్వు కారణంగా మార్పులు చోటుచేసుకుంటాయని, దీని వల్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీవ కణజాలం నిర్లిప్తంగా తయారవుతుందని వారు స్పష్టం చేశారు.

More Telugu News