: ఎండలో తిరగని మహిళల్లో నిరాశా, నిస్పృహలు అధికం... అమెరికా వర్సిటీ అధ్యయనం

శరీరంలో చాలినంతగా డీ విటమిన్ లేని మహిళలు ఇతరులతో పోలిస్తే అధికంగా నిరాశా, నిస్పృహలను కలిగి ఉంటారని ఒక అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలూ లేకున్నా డీ విటమిన్ తగ్గితే మహిళల్లో డిప్రెషన్ పెరుగుతుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ తాజా అధ్యయనం తెలిపింది. డీ విటమిన్ లోపంతో ఉన్నవారికి మిగతావారితో పోలిస్తే త్వరగా నిరాశ ఆవహిస్తుందని వివరించింది. రకరకాల కారణాలతో డిప్రెషన్ వస్తుందని, వాటిల్లో డీ విటమిన్ లోపం ఒకటని అధ్యయన రచయిత డేవిడ్ కెర్ తెలియజేశారు. ఎముకల ఆరోగ్యానికి, కండరాల మెరుగైన పనితీరుకు డీ విటమిన్ తప్పనిసరని గుర్తుచేసిన ఆయన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిరాశా, నిస్పృహల స్థాయి మారుతోందని తెలిపారు. ఈ రీసెర్చ్ కోసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న 185 మంది కాలేజీ విద్యార్థినులను భాగం చేశామని వివరించారు. వారి రక్తంలోని డీ విటమిన్ పరిమాణాన్ని, డిప్రెషన్ ను 5 వారాల పాటు పరిశీలించామని తెలిపారు. కాగా, డీ విటమిన్ సూర్యరశ్మి నుంచి శరీరానికి లభిస్తుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News