: గతేడాది... చరిత్రలో అత్యంత ‘ఉష్ణ’ వత్సరం!

భూగోళ చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2014 రికార్డు సృష్టించింది. గతేడాది ప్రపంచంలోని వివిధ దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వాటిలోనూ అమెరికాలోని అలస్కాలో రికార్డు స్థాయి నమోదయ్యాయి. ఇక యూరోపియన్ దేశాలనూ భానుడు తన ప్రతాపంతో ఉడుకెత్తించాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు భూగోళంపై పెరుగుతున్న కర్బన ఉద్గారాలే కారణమని చెబుతున్న శాస్త్రవేత్తలు, సకాలంలో మేల్కోకపోతే భవిష్యత్తులో పెను ముప్పు తప్పదని చెప్పకనే చెబుతున్నారు. నిన్నటిదాకా 2010 ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, ఆ రికార్డు కేవలం నాలుగేళ్లలో బద్దలు కావడాన్ని వారు ప్రమాద ఘంటికగానే భావిస్తున్నారు. 20వ శతాబ్దంలో ఎల్ నినో ఏర్పడ్డ 1998... అత్యంత వేడి వత్సరంగా నమోదైన సంగతి తెలిసిందే. అయితే 1998 కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన 2014లో ఎల్ నినో లాంటి ఉపద్రవం ఏర్పడలేదు. అయితే సమీప భవిష్యత్తులో 1998 నాటి ఉపద్రవం కంటే బలమైన ఎల్ నినో ఏర్పడే ప్రమాదం లేకపోలేదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే, నాలుగేళ్లలోనే బద్దలైన అధిక ఉష్ణోగ్రతల రికార్డు, ఇకపై రెండు, మూడేళ్లకోమారు సరికొత్త రికార్డులు నమోదు కావడమే కాక, ఎల్ నినో లాంటి ఉత్పాతాలు తరచూ జరిగే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు.

More Telugu News