: మనిషి మీద జరిగే విష ప్రయోగాల రకాలు ఇవే...!

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ దివంగత భార్య సునంద పుష్కర్ హత్యలో వినియోగించిన విషం పొలోనియంగా గుర్తించడంతో, అసలు మానవ శరీరంపై జరిగే విషప్రయోగాల గురించి చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకెళితే... థాలియం ఓ విషపదార్థం. దీనిని మనిషిపై ప్రయోగిస్తే, మానవ శరీరంలోని ద్రావణాల నుంచి దీనిని వేరుచేయడం కష్టం. థాలియం.. సోడియం, పోటాషియం లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో ఇది శరీరంలో సులువుగా కలిసిపోతుంది. పొలోనియం 210 అనేది మరో రకమైన విష పదార్ధం. సునంద పుష్కర్ పై ప్రయోగించినదిగా భావిస్తున్నది ఇదే. ఇది అత్యంత అరుదైన విషపదార్ధం. అత్యంత శక్తిమంతమైన రేడియోధార్మిక పదార్థం కూడా. దీనిని గుర్తించడం చాలా కష్టం. చాలా తక్కువ మోతాదులో పౌడర్ రూపంలో లేదా ఏదైనా ద్రవపదార్థంలో కలిపి ఇస్తే...మనిషి ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టే. ఇక, గన్నేరు పప్పు విషయానికొస్తే... సాధారణంగా మనం గ్రామాల్లో దీన్ని చూస్తుంటాం. సైంటిఫిక్ భాషలో నీరియం అలెండర్ అంటారు. ఇది ఓలెన్రిన్ గ్లైకోసైడ్ లను కలిగి ఉంటుంది. దీనిని ఇమ్యునో అస్సే పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. దీనిని తీసుకుంటే క్షణాల్లో ప్రభావం చూపదు. వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. ఇకపోతే, నిత్యం వార్తల్లో వినేది పాము కాటు గురించి. పాము విషం కారణంగా దేశంలో చాలా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, కొన్ని జాతులకు చెందిన పాముల్లోనే విషం ఉంటుంది. పాము విషం చాలా త్వరగా శరీరంలో అంతర్థానమైపోతుంది. కనుక దీనిని రసాయన పరీక్షల ద్వారా గుర్తించడం చాలా కష్టం. పాము విషం ప్రొటీన్ సహితం కావడం వల్ల, అది త్వరితగతిన శరీరంలోని కణజాలంలోకి వెళ్లిపోతుంది. దీనిని శరీరం నుంచి వేరుచేయడం సాధ్యం కాదు. ఇక, ఎర్గాట్ ఆల్కలాయిడ్లు, ఫెనోథియాజైన్స్, లైసర్గైడ్లను ఫోటోలబైల్ విషాలుగా పిలుస్తారు. ఈ విషాలన్నీ చాలా సున్నితమైనవి. వెలుతురు తగిలితే అవి పాడైపోతాయి. దీంతో వీటిని గుర్తించడం సాధ్యం కాదు. మత్తు కలిగించే హెరాయిన్ కూడా విషమేనట. ఇది నీటితో కలిస్తే మోనో ఎసిటైల్ మార్ఫిన్, మార్ఫిన్ గా మారిపోతుంది. కనుక దీనిని కూడా గుర్తించడం కష్టం.

More Telugu News