: ఆ గ్రామానికి శని దేవుడే రక్షకుడు!

మహారాష్ట్రలోని శని శింగనాపూర్ గ్రామం పుణ్యక్షేత్రంగా ఎందరికో పరిచితమే. కానీ, ఆ గ్రామానికున్న విశిష్టత గురించి కొందరికే తెలుసు. అదేంటంటే... ఆ ఊర్లో ఏ ఇంటికీ తలుపులు కనిపించవు, ఆఖరికి బ్యాంకుకు కూడా! గ్రామస్తులు డబ్బు కట్టలను మూతల్లేని డబ్బాల్లో పెడుతుంటారు. పబ్లిగ్గా నగదును తీసుకెళుతుంటారు. దొంగల భయం లేదా అంటే అస్సలు ఉండదంటారు అక్కడి గ్రామస్తులు. శని దేవుడు తమకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాడంటూ కృతజ్ఞతలు చెబుతారు. తరతరాలుగా ఇది కొనసాగుతుండడం విశేషం. జయశ్రీ అనే గృహిణి మీడియాతో మాట్లాడుతూ, ఏళ్ల క్రితం శని దేవుడు భక్తులకు కలలో కనిపించి "మీ నివాసాలకు తలుపులు ఏర్పాటు చేయొద్దు. నేను మీకు రక్షగా ఉంటాను" అని చెప్పాడని వివరించింది. అప్పటి నుంచి గ్రామంలో ఎవరింటికీ తలుపులు ఏర్పాటు చేయరని తెలిపింది. క్రూర మృగాల భయంతో రాత్రిళ్లు ద్వారానికి అడ్డంగా గ్రిల్స్ వంటి వాటిని ఉంచుతామని ఓ గ్రామస్తుడు తెలిపాడు. ఇక, ఆ గ్రామంలో యూకో బ్యాంకు శాఖ ఉంది. డబ్బును స్ట్రాంగ్ రూంలో ఉంచుతారు. అయితే, బ్యాంకు ముందు భాగంలో తలుపులకు బదులు అద్దాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఊరకుక్కలు లోపలికి ప్రవేశించకుండా వాటిని బిగించారు. ఈ ఏర్పాట్లతో తమకెలాంటి సమస్య లేదని అంటారు బ్యాంకు ఉద్యోగి నాగేందర్ సెహ్రావత్.

More Telugu News