'సెల్ఫీ' కోసం ట్రై చేశాడు... ఫొటో రాలేదు, కానీ ప్రాణం పోయింది!

04-08-2014 Mon 16:02

సెల్ఫీ కోసం చేసిన ప్రయత్నం మెక్సికోలో ఓ యువకుడి ప్రాణాలను హరించివేసింది. మెక్సికో సిటీలో జరిగిందీ విషాద ఘటన. ఆ యువకుడి పేరు ఆస్కార్ ఒటెరో అగిలార్ (21). స్నేహితులతో చిత్తుగా మద్యం తాగిన అతడు ఫేస్ బుక్ లో పోస్టు చేసేందుకని తలకు తుపాకీ గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకోబోయాడు. అది కాస్తా పేలడంతో ఆస్కార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. తుపాకీ శబ్దం విన్న పొరుగు వ్యక్తి మాన్ ఫ్రెడో పయేజ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చేటప్పటికి ఆస్కార్ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. కాసేపటికి అతను చనిపోయాడు. కాగా, దీనికి సంబంధించి ఆస్కార్ స్నేహితుల్లో ఒకరైన ఒమర్ కాంపోస్ ను అరెస్టు చేశారు. మరో స్నేహితుడు పాల్ ఎల్పాకో పరారీలో ఉన్నాడు.