కలెక్టర్ ఉప్మాలో మిడత... కఠిన చర్యలకు ఆదేశం

04-08-2014 Mon 12:57

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శినికి వింత అనుభవం ఎదురైంది. నిన్న ఉదయం స్థానికంగా ఉండే గురుప్రసాద్ హోటల్ నుంచి ఉప్మా పార్సిల్ తెప్పించుకున్నారు. అది తినడానికి పార్శిల్ ఓపెన్ చేయగానే అందులో మిడత కనిపించింది. దీంతో కలెక్టర్ షాక్ కు గురయ్యారు. వెంటనే హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హోటల్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన శానిటరీ అధికారులు... హోటల్ లోని ఆహారాన్ని హైదరాబాదులోని ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ కు పరీక్ష నిమిత్తం పంపించారు. హోటల్ వ్యవహారం ప్రస్తుతం మహబూబ్ నగర్లో పెద్ద చర్చను లేవదీసింది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కు పంపిన ఆహారంలోనే మిడతలు వస్తే... సామాన్యులకు ఇంకేం వేస్తున్నారో అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.