: ఏపీ నామినేటెడ్ పోస్టులు కావాలంటున్న తెలంగాణ టీడీపీ నేతలు... ఇరకాటంలో బాబు

తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చేస్తోన్న ఓ డిమాండ్ తో చంద్రబాబు ధర్మసంకటంలో పడ్డారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ పటిష్ఠతకు నిర్విరామంగా కృషి చేశామని... అందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తమకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబునాయుడు సమావేశమైనప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నామినేటెడ్ పోస్టుల్లోనైనా తమను నియమించాలని తెలంగాణ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ నాయకులను ఏపీ నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా... వారు వినిపించుకోవడం లేదు. చంద్రబాబు వాదనకు వారు మరో ఆసక్తికరమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. ఏపీకి చెందిన కొన్ని శాఖల్లో నిపుణులు, అనుభవజ్ఞులనే కారణంతో ఉత్తరాది వారిని సలహాదారులుగా, కన్సల్టెంటులుగా ప్రభుత్వం నియమించిందని... అదే విధానంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులను ఏపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల్లో నియమిస్తే తప్పేంటని వారు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచే ఏపీ ప్రభుత్వం పరిపాలన వ్యవహారాలు చూస్తున్నందున్న సచివాలయ స్థాయిలో కానీ... ఇతర ప్రధాన శాఖల్లో కానీ... కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల్లో కానీ తమను నియమించాలని వారు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో కనీసం రెండు పోస్టులను వారు ఆశిస్తున్నారు. ఏపీలోని నామినేటెడ్ పోస్టుల్లో తెలంగాణ వారిని నియమిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తున్న చంద్రబాబు... కేంద్రప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులను తెలంగాణ టీడీపీ నాయకులకు ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీని వారు నమ్మడం లేదు. కేంద్రప్రభుత్వంలో తెలంగాణ బీజేపీ నాయకులకే ప్రాధాన్యత ఉంటుందని... తమకు అంతగా ప్రాధాన్యం ఉండదని వారు చంద్రబాబుతో వాదిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో తమను కొన్ని నామినేటెడ్ పోస్టుల్లోనైనా నియమించాలని వారు చంద్రబాబు దగ్గర మంకుపట్టు పడుతున్నారు. ఈ విషయంలో కొంత మంది తెలంగాణ టీడీపీ నాయకులు అలక పూనడంతో వారిని ఎలా సంతృప్తిపరచాలా? అని చంద్రబాబు తీవ్రంగా యోచిస్తోన్నట్టు సమాచారం.

More Telugu News