సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలను సమర్థించిన మణిశంకర్ అయ్యర్

03-08-2014 Sun 17:47

సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారన్న కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సమర్ధించారు. నట్వర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని మణిశంకర్ స్పష్టం చేశారు. 2004 లో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపినా, వెనక్కు తగ్గడానికి రాహులే కారణం అయ్యి ఉండవచ్చని మణిశంకర్ అభిప్రాయపడ్డారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ భయపడి ఉండవచ్చని మణిశంకర్ తెలిపారు. తల్లిపై కొడుకుకు ఆందోళన సహజమని ఆయన అన్నారు. ఒకవేళ సోనియా ప్రధాని పదవి తిరస్కరించడానికి వేరే కారణాలు ఉండి ఉంటే అవి నట్వర్ కు తెలిసిఉండకపోవచ్చని అయ్యర్ వెల్లడించారు. నట్వర్ సింగ్ గాంధీ కుటుంబానికి ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వాస్తవాలను ఆత్మకథ పేరుతో బయటపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.