మోడీ సర్కార్ ను మెచ్చుకున్న ప్రణబ్ ముఖర్జీ

03-08-2014 Sun 13:52

మోడీ సర్కార్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెచ్చుకున్నారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) ప్రవాహాన్ని పెంచే దిశగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. దేశంలో పేదరికం తగ్గించాలంటే దేశ ఆర్థికవృద్ధి రేటును 8 నుంచి 9 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలో పొదుపుచర్యలు పాటించడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి, విదేశీ పెట్టుబడులను పెంచే విధంగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు హర్షణీయమని ఆయన అన్నారు. ఇక రాష్ట్రపతిగా రాజ్యాంగపరమైన బాధ్యతల కారణంగా సమావేశాల్లో ఇతరులు చెప్పింది వినడమే తప్ప, ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాని ప్రణబ్ అన్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించానని... ఇప్పుడు రాష్ట్రపతి పదవిలో ఉన్న కారణంగా వాటిపై చర్చలు జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు.