స్థానికత విషయంపై కేసీఆర్ వార్నింగ్ తో తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లకు వెన్నులో వణుకు

03-08-2014 Sun 12:57

1956 స్థానికత నిర్ధారణ విషయం తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. స్థానికతకు సంబంధించి ఏ ఒక్క తప్పుడు పత్రం జారీ చేసినా... ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. స్థానికత ధ్రువీకరణ పత్రాలలో పొరపాటున తప్పులు దొర్లితే ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికత నిర్ధారణ చాలా తేలికని... అయితే పట్టణ ప్రాంతాల్లో స్థానికత నిర్థారించడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికతపై తప్పుడు పత్రాలు ఇచ్చిన వాళ్లను ఎలాగోలా పట్టుకోవచ్చని... కానీ అసలు ఏ పత్రాలు లేని వాళ్ల స్థానికతను నిర్ధారించడం ఎలాగో తెలియక వారు మల్లగుల్లాలు పడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర స్థానికతకు తాత, తండ్రి సమర్పించే పత్రాలు కీలకం కానున్నాయి. 1956కు ముందునుంచి నివాసముంటున్నట్లు తెలియజేసే ఆధారాల కోసం భూమి పత్రాలు, కౌలు పత్రాలు, పన్నులు కడితే ట్యాక్స్‌ రసీదులు, కరెంట్‌ కనెక్షన్‌ బిల్లులు స్థానికత నిర్థారణకు కీలకం కానున్నాయి. తాత స్థానికత నిర్ధారణ అయితే తండ్రి స్థానికతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.