: హైదరాబాద్ పోలీసులు ఇకపై 'మర్యాదరామన్న'లు!

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులని 'మర్యాదరామన్న'లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. నయా పోలీసింగ్ లో భాగంగా ఇప్పటికే వేలసంఖ్యలో కొత్త వాహనాలు, వందల సంఖ్యలో నూతన నియామకాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే, పోలీసుల ప్రవర్తనలో కూడా సమూలమార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు హోంశాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం కీలకం కానుంది. హైదరాబాద్ లో పనిచేసే పోలీసుల పనితీరు విదేశీ సంస్థలు, వారి ప్రతినిధులపై పడతుండడంతో... ముందుగా హైదరాబాద్ పోలీసుల నోటిదురుసును తగ్గించేందుకు హోంశాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా హైదరాబాద్ పోలీసులకు 'మర్యాద పాఠాలు' నేర్పేందుకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని అధికారులు నిశ్చయించుకున్నారు. నగరంలోని సామాన్య పౌరుల పట్ల ఎలా ప్రవర్తించాలి... స్టేషన్ కు వచ్చినవారితో మర్యాదగా ఎలా మాట్లాడాలి... బాడీలాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలనే దానిపై సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ ఫర్ట్స్ తో శిక్షణ ఇప్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ నెలలో ప్రారంభించనున్నారు.

More Telugu News