వివాదాస్పద రచయిత్రికి రెసిడెంట్ వీసా

02-08-2014 Sat 21:35

ప్రముఖ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ కు కేంద్ర ప్రభుత్వం వీసా ఇచ్చింది. బంగ్లాదేశ్ కు చెందిన తస్లీమా ముస్లిం మహిళల ఆంక్షలపై తన నవలల్లో ఎలుగెత్తడం కారణంగా ఆమెకు దేశ బహిష్కరణ విధించింది బంగ్లాదేశ్. దీంతో ఆమె భారత్ చేరారు. ఇక్కడ కూడా ఆమెకు ఓ వర్గం నుంచి అవమానాలు ఎదురైనా, భారతీయులు ఆమెను ఆదరించి, మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని చాటి చెప్పారు. గత కొన్నేళ్లుగా పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఆశ్రయం పొందుతున్న తస్లీమా, తనకు శాశ్వత వీసా కేటాయిస్తే బాగుంటుందని ఆమె భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు రెసిడెన్షియల్ వీసా ఇచ్చింది. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తనను ఆదరించిన భారత దేశానికి కృతజ్ఞతలని తస్లీమా నస్రీన్ తెలిపారు. ఆమెకు వీసా కేటాయించడంపై మానవ హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఛాందసవాదులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులని, వారితో తాను పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూనే ఉంటానని ఆమె తెలిపారు. వాదం పేరిట అణగద్రొక్కే వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.