'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి ఫుల్ స్టాప్... చిరు సందడి రేపే!

02-08-2014 Sat 18:21

ప్రముఖ తెలుగు సినిమా హీరో నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' క్విజ్ ప్రోగ్రామ్ కి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. ఆగస్టు 7న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ తో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ముగియనుంది. 45 ఎపిసోడ్లు షూట్ చేసినప్పటికీ, ఇప్పటి వరకు 40 ఎపిసోడ్లు మాత్రమే ప్రసారం చేశారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒరిజనల్ వెర్షన్ 'కౌన్ బనేగా మహా కరోడ్ పతి' హిందీలో ప్రసారం కానున్న నేపథ్యంలో, ఒప్పందం ప్రకారం తెలుగు వెర్షన్ ను నిలిపివేయనున్నారు. తెలుగు ప్రజల నుంచి ఈ షోకు విశేషమైన ఆదరణ లభించిందని షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున పేర్కొన్నారు. ఈ షో తనకు ఎంతో నచ్చిందని, మరెందరినో దగ్గర చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా రేపు ప్రసారమయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'లో మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పాల్గొననుండడం అదనపు ఆకర్షణగా మారింది.