ఇండోర్ ఎయిర్ పోర్టులో ఆటో స్టాండ్!

02-08-2014 Sat 17:42

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం ఓ విషయంలో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో ఆటోల కోసం ఓ స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి తక్కువ ఖర్చుతో నగరంలోకి వెళ్ళేందుకు ఆటోలు ఉపయుక్తంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు. అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐసీటీఎస్ఎల్) ఇటీవలే ఎయిర్ పోర్టు డైరక్టర్ కు ఓ ప్రతిపాదన పంపింది. ఆటోలు నిలుపుకునేందుకు స్థలం చూపాలని కోరింది. కాగా, ఈ ప్రతిపాదనకు అనుమతి వస్తే ఇక్కడో ఆటో కౌంటర్ తో పాటు స్టాండ్ కూడా వెలుస్తుంది. తమ ప్రతిపాదనకు సమ్మతి లభిస్తుందని భావిస్తున్నట్టు ఏఐసీటీఎస్ఎల్ సీఈఓ సందీప్ సోని అన్నారు. ఆటోలన్నింటికి జీపీఎస్ వ్యవస్థ అమర్చుతామని తెలిపారు.