తండ్రిని చంపేశాడు... తప్పుకదా అన్న వ్యక్తినీ చంపేశాడు!

02-08-2014 Sat 15:05

చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువులో దారుణం చోటుచేసుకుంది. తండ్రి కేశవరెడ్డి సంపాదించిన భూమిని తన పేరిట బదలాయించాలని అతని కుమారుడు విశ్వనాథ్ రెడ్డి చాలాకాలంగా గొడవపడుతున్నాడు. నిన్న రాత్రి ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. రాత్రి ఎలాగోలా సర్దుకున్న వివాదం తెల్లవారి మరోసారి రాజుకుంది. భూమి తనకు ఇవ్వాల్సిందేనంటూ విశ్వనాథ్ రెడ్డి తన తండ్రిపై దాడిచేశాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీనిని గమనించిన కృష్ణయ్య అనే వ్యక్తి ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేస్తావా? తప్పు కదూ? అంటూ ప్రశ్నించాడు. నన్నే తప్పు పడతావా? అంటూ అతడిపై దాడికి దిగాడు విశ్వనాథరెడ్డి. దీంతో, కృష్ణయ్య కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది చూసి ఆగ్రహించిన చుట్టుప్రక్కలవారు అతడిని బంధించి చితక్కొట్టారు. చావుదెబ్బలు తిన్న విశ్వనాథ్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.