క్లీన్ ఎనర్జీ... ఇప్పుడిదే మోడీ మంత్రా

02-08-2014 Sat 10:45

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ (పర్యావరణ హిత విద్యుదుత్పత్తి) పైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. సోలార్, విండ్ పవర్ విధానాలకు పెద్దపీట వేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ అంశంపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, 'క్లీన్ ఎనర్జీ' అంశం తమ ప్రభుత్వ తక్షణ ప్రాధాన్య అంశమని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ నుంచి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం బొగ్గుపై సెస్ పెంచామని చెప్పారు. ఇప్పటి వరకు కోల్ సెస్ టన్నుకు రూ.50 ఉండగా, దానిని తాజా బడ్జెట్ లో రూ.100 కు పెంచామని వెల్లడించారు. బొగ్గుతో పాటు పీట్, లిగ్నైట్ వంటి ఖనిజాలపైనా సెస్ విధించామని, తద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.3000 కోట్లు చేరతాయని తెలిపారు. ఈ సొమ్మును క్లీన్ ఎనర్జీ ఉత్పాదనకు వినియోగిస్తామని జవదేకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు.