అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల సంతకాలకు స్వస్తి పలుకుతున్న కేంద్రం

02-08-2014 Sat 09:38

ఎన్నో రకాల కార్యకలాపాలకు అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల ధృవీకరణ సంతకాలు కలిగిన పత్రాలను సమర్పించే సంప్రదాయం ఇప్పటిదాకా ఉంది. ఈ పద్ధతికి కేంద్ర ప్రభుత్వం మంగళం పలుకుతోంది. ఎవరికి వారే ధృవీకరణ పత్రాలను సమర్పించే పద్ధతిని అమలు చేసే దిశగా ప్రధాని మోడీ అడుగు వేశారు. అయితే, ఇలా స్వయంగా పత్రాలను సమర్పించే విషయంలో అవకతవకలకు పాల్పడితే పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద నేరుగా కేసు నమోదు చేస్తారు.అఫిడవిట్ల వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని, ఆయా వ్యక్తులు స్వయంగా అందించే పత్రాలనే స్వీకరించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు ఇప్పటికే సూచనలు అందాయి. స్వయంగా ధృవీకరణ పత్రాలను అందజేసినవారు... చివరి దశలో ఒరిజినల్స్ చూపిస్తే సరిపోతుంది. ఈ విషయం వల్ల సామాన్యులకు చాలా మేలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల సంతకాల కోసం సామాన్యులకు బోలెడంత సమయం వృథా కావడమే కాకుండా... డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి తోడు అధికారుల సమయాన్ని కూడా ఈ పద్ధతి వృథా చేస్తోంది. అందుకే, ఈ పద్ధతికి మంగళం పలికేందుకు కేంద్రం సిద్ధమైంది.