ఖమ్మం టీడీపీలో ’జడ్పీ‘ ఫైట్!

02-08-2014 Sat 08:48

ఖమ్మం జిల్లా టీడీపీలో జిల్లా పరిషత్ పీఠంపై సంవాదం నడుస్తోంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావుల మధ్య నెలకొన్న ఈ సంవాదం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున బరిలో నిలిచి జడ్పీటీసీలుగా విజయం సాధించిన ఎస్సీ మహిళలు ఆరుగురున్నారు. వీరిలో ఎవరిని జడ్పీ పీఠం వరిస్తుందోనన్న అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికలకు ముందు నుంచి జిల్లా టీడీపీలో తుమ్మల, నామాల మధ్య విభేదాలు పొడచూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. జడ్పీ పీఠం తమ వర్గానికి దక్కాలంటే, కాదు తమ వర్గానికే చెందాలని ఇరువర్గాలు వాదులాడుకుంటున్నాయి. దీంతో జిల్లా స్థాయిలో ఈ పంచాయితీ తెగదని భావించిన చంద్రబాబు, వారిని శుక్రవారం హైదరాబాద్ పిలిపించారు. అయినా సయోధ్య కుదరలేదు. అంతేకాక ఇరువర్గాలు తుది నిర్ణయాన్ని అధినేతపైనే వేసేసి వెళ్లిపోయాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే, తుమ్మల వర్గమే బలంగా కనిపిస్తోంది. పార్టీ చేజిక్కించుకున్న జడ్పీటీసీల్లో మెజార్టీ సీట్లు ఆయన వర్గానికి చెందిన వారివేనని పార్టీ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. అయితే చంద్రబాబు కోటరీలో ముఖ్యుడిగా కొనసాగుతున్న తాను, జడ్పీ పీఠాన్ని తన వర్గానికి ఇప్పించుకోలేనా? అన్న భావనతో నామా, దీనిపై కాస్త పట్టు బిగించారు. ఎలాగైనా ఈసారి తమ సత్తా చాటడంతో పాటు ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టాల్సిందేనని ఇరువురు నేతలు ఒకింత గట్టిగానే యత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే, ఎవరి వాదనకు చంద్రబాబు ఓటేస్తారో శనివారం తేలిపోనుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.