: కేసీఆర్ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే: లక్ష్మీపార్వతి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆయన వైఖరి సరైంది కాదని కుండబద్దలు కొట్టారు. అమెరికాలాంటి దేశంలోనే 7 సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డు ఇస్తున్నారని... అమెరికన్లతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. అలాంటిది తెలుగు గడ్డపైనే తెలుగువారిని పరాయివారుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 1956 ముందు ఉన్నవారే ఇక్కడివారని... తర్వాత నుంచి ఉన్నవారు ఇక్కడివారు కాదనే అంశం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ఇంకా మారలేదని... ఇంకా, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవాలనే ప్రయత్నిస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర అనే విద్వేషాలను ఇప్పటికీ పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొన్నటిదాకా ఇక్కడి వారంతా తెలంగాణ వారే అన్న కేసీఆర్... ఇప్పడు మాట మార్చారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను ఇండియా, పాకిస్థాన్ మాదిరి మార్చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవర్తనతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ స్టూడెంట్లకే ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని... ఇప్పటికిప్పుడు ఇలాంటి మార్పులు చేస్తే మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఏమి కావాలని ఆమె నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు సరిగా లేదని... భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయో అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

More Telugu News