పాట పాడి ‘రభస’ చేసిన జూనియర్ ఎన్టీఆర్

01-08-2014 Fri 22:01

ఆడియో వేడుకకు వచ్చి ఇక్కడ కూర్చుని తాను చాలా ఆలోచించానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... 17 ఏళ్ల వయసులో తాను ఓ తండ్రికి కొడుకుగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టానని... ఇప్పుడు అభిమానుల ఆశీస్సులతో ఇంతలా ఎదిగానని... చాలా మంది అభిమానానికి పాత్రుడినయ్యానని అన్నారు. తనను ఇంతలా ఆదరించిన ఆప్తులకు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. తన క్షేమం కాంక్షించే వారందరి అభిమానం అలాగే ఉంది కనుక తన భార్యాబిడ్డ క్షేమంగా ఉన్నారని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘రభస’ సినిమా ఎన్నో కష్టాలు దాటుకుని పూర్తయిందన్నారు. దర్శకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, సినిమా నిర్మాణం ఆలస్యమైందని... అయినా సరే, సినిమా అభిమానులను అలరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన స్వరాలు సమకూర్చిన తమన్ కు ధన్యవాదాలు అని ఎన్టీఆర్ తెలిపారు. దర్శకుడి కష్టం కోసమైనా సినిమా సూపర్ హిట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆది’ సినిమా నాటికి తానే పిల్లాడ్నైతే, తన ముందు మరో ఇద్దరు పిల్లలు ఉండేవారని వారే బెల్లంకొండ గణేష్, ‘అల్లుడు శీను’ బెల్లంకొండ శ్రీనివాస్ అని అన్నారు. వారు ఒకరు నిర్మాతగా, మరొకరు సినీ హీరోగా ఎదగడం తనను ఆనందానికి గురి చేసిందని అన్నారు. అలాగే అభిమానులకు ఏదయినా జరిగితే తట్టుకోలేనని తెలిపిన ఎన్టీఆర్, తండ్రి అయ్యాక బిడ్డ విలువ తెలుస్తుందని అన్నారు.మీ తల్లిదండ్రులు కూడా మీకేమీ కాకూడదని కోరుకుంటారని, అందుకే అభిమానులంతా జాగ్రత్తగా ఇంటికెళ్లండని ఆయన అభ్యర్థించారు. అభిమానులు, ఆప్తుల కోరిక మేరకు ‘రభస’ సినిమాలో తాను పాడిన పాట పల్లవి పాడి జూనియర్ ఎన్టీఆర్ అందర్నీ అలరించాడు.