కూతురు వరస బాలికతో క్రైం రిపోర్టర్ వెకిలి వేషాలు

01-08-2014 Fri 18:34

కన్న కూతురు కానప్పటికీ కూతురు వరసే ... కానీ అతనిలో కామాంధుడు విచక్షణ మరిచాడు. సమాజంలో దారుణాలని వెలికి తీసే జర్నలిస్టుగా పనిచేశాడు, అయినప్పటికీ తాను చేస్తున్నది తప్పని తెలిసీ దారుణానికి తెరతీశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రబ్బ రవివర్మ (45) హైదరాబాదు రామంతాపూర్‌లోని దూరదర్శన్‌ కాలనీలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. రవివర్మ గతంలో ఓ న్యూస్ మేగజైన్‌కు క్రైం రిపోర్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో విశాఖపట్టణానికి చెందిన ఉమామహేశ్వరితో పరిచయం ఏర్పడింది. దీంతో వారు ఫోన్, ఇంటర్‌నెట్ ద్వారా మాట్లాడుకొనేవారు. తనకు ఓ ప్రాజెక్ట్ వచ్చిందని, దాన్ని పూర్తి చేస్తే రూ.500 కోట్లు వస్తాయని, అందుకు కొంత డబ్బు అవసరమని రవివర్మ మహేశ్వరికి మాయమాటలు చెప్పి నమ్మించాడు. దీంతో ఆమె యూఎస్‌లో ఉంటున్న తన స్నేహితురాలు రాగలక్ష్మికి విషయం చెప్పి, ఒకరికొకరిని పరిచయం చేసింది. స్నేహితురాలిపై అభిమానం, అతని మాయమాటలను పసిగట్టలేనితనం, ఇచ్చే డబ్బు కూడా పెట్టుబడే కదా అన్న ఆలోచనతో ఆమె 50 వేల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 23 లక్షలు) పంపింది. అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలతో యూఎస్‌లో ఉంటున్న రాగలక్ష్మి 2013లో భారత్ రావడంతో ఆమెను పెళ్లాడాడు రవివర్మ. పెళ్లైన తరువాత కొంతకాలం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురమున్నారు. సెలవులు ముగిసిపోవడంతో రాగలక్ష్మి తన కుమార్తె(14)ను నగరంలోని సోదరి నాగదేవి ఇంటి వద్ద ఉంచి, కొడుకును తీసుకొని యూఎస్ వెళ్లిపోయింది. దీంతో రవివర్మ తరచూ నాగదేవి ఇంటికి వెళ్లి.. వరుసకు కుమార్తె అయిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ ఏడాది జూన్‌లో నగరానికి వచ్చిన రాగలక్ష్మి, రవివర్మ పిల్లలతో కలిసి నేపాల్ వెకేషన్ కోసం వెళ్లింది. అక్కడ రవివర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలగడంతో, నేపాల్ నుంచి రాగానే కుమార్తెను సీతాఫల్‌మండి మేడిబావిలోని మరో సోదరి స్నేహాదేవి ఇంట్లో ఉంచి యూఎస్ వెళ్లిపోయింది. జూలై 27న స్నేహాదేవి ఇంటికి వచ్చిన రవివర్మ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఎవరికైనా చెబితే పాస్‌పోర్టు చింపేస్తానని, తల్లితో కూడా కలవకుండా చేస్తానని బెదిరించాడు. దీంతో జరిగిన విషయాన్ని పిన్ని స్నేహదేవికి చెప్పింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్నేహాదేవి బాలికతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవివర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.