ఆర్టీసీలో రేపటి నుంచి సమ్మె జరుగుతుందా?

01-08-2014 Fri 18:09

ఆర్టీసీ యాజమాన్యంతో గురువారం నాడు ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కార్మిక సంఘ నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో... ఈయూ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ బస్సులు రోడ్డెక్కవని యూనియన్ నేతలు చెప్పారు. అసలే నష్టాల్లో నడుస్తోన్న ఆర్టీసీకి కార్మికులు శనివారం నుంచి సమ్మెకు దిగితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. ఈ నేపథ్యంలో, సమ్మె నివారణకు ఆర్టీసీ నడుం బిగించింది. ఇవాళ (శుక్రవారం) సాయంత్రం ఎంప్లాయీస్ యూనియన్ నేతలను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. కొద్దిసేపటి క్రితమే చర్చలు ప్రారంభమయ్యాయి. మరి, ఈ చర్చలు సఫలమవుతాయా? లేదా? అన్నది కాసేపట్లో తేలిపోనుంది.