: ఫేస్ బుక్ బంపరాఫర్... ఫ్రీ ఇంటర్నెట్

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ప్రపంచ జనాభాలో 85 శాతం మంది ప్రజలు నివసించే ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ లు వినియోగంలో ఉన్నాయి. కానీ, 30 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఫేస్ బుక్ వినియోగం విస్తృతంగా ఉండడంతో మొబైల్ వినియోగం ఉన్న ప్రతి చోట ఫేస్ బుక్ వినియోగం ఉండేలా 'ఇంటర్నెట్.ఆర్గ్' పేరిట ఓ యాప్ ను ఫేస్ బుక్ విడుదల చేసింది. దీనిని డౌన్ లోడ్ చేసుకుంటే ఎవరైనా తమ ఫోన్ లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా పొందవచ్చు. స్థానికంగా అందే వైద్యం, విద్య, ఉద్యోగావకాశాలు, వాతావరణానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కోసం ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చని ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకెర్ బర్గ్ వెల్లడించారు. ఈ యాప్ తో ఫేస్ బుక్, గూగుల్ సెర్చ్, వికీపీడియాను కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. అయితే, ఈ యాప్ అప్పుడే మనకి అందుబాటులో లేదు. జాంబియాలో ఎయిర్ టెల్ వినియోగదారులు ప్రస్తుతానికి ఈ సౌకర్యం పొందుతున్నారు. ఇక్కడి ఫీడ్ బ్యాక్ ను ఆధారంగా చేసుకుని మిగిలిన దేశాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని జుకెర్ బర్గ్ తెలిపారు.

More Telugu News