ap7am logo

అదే రాజబాబు గొప్పతనం!

Sat, Jun 23, 2012
రాజబాబు
రాజబాబు
        తెలుగు తెరకి అలుపెరుగని హాస్యాన్ని రుచి
చూపించిన అసమాన నటుడు రాజబాబు. నటనలోనే కాదు వ్యక్తిత్వం లోను ఎంతో గొప్ప
వాడని పించుకున్న  హాస్యరస చక్రవర్తి ఆయన. రాజబాబు కెరియర్ ని పరిశీలిస్తే,
మంచితనానికీ ... మానవత్వానికి ఆయన ప్రతీకలా కనిపించే సంఘటనలు కోకొల్లలుగా
కనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకసారి ఓ చిత్రం షూటింగ్ సమయంలో
జరిగింది.

       అవి 'భలేకాపురం' (1980) సినిమా షూటింగ్ జరుగుతోన్న రోజులు. ఆ
సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం
'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు.
ఇక 'భలే కాపురం' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని
చెన్నైలోని వాహినీ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు - రమాప్రభలపై
కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీక రించవలసి ఉంది. అయితే,
అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు, ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

       ఆ పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం
ఇష్టంలేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన
ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా
తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చక చకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ
ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో
కప్పిపెడుతోన్న రాజబాబుని చూసి ఆయన షాక్ అయ్యారు. ''ఇలాంటి పరిస్థితుల్లో
ఎందుకు
వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా'' అని గోపాలకృష్ణ
కంగారుగా అన్నారు.

       "నేను ఎంతో మందికి ఎన్నో చేశాను ... మీకు మాత్రం ఏమీ
చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా
వచ్చేశాను'' అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ
దర్శకుడు, వెంటనే ఆయన సీన్స్ ని చక చకా తీసేసి పంపించారట. దాంతో
రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ ఎరుగనట్టు బెడ్
పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)