ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాటల తూటాలు పేల్చిన మహారథి ఇక లేరు!

Fri, Dec 23, 2011
        తన వాడి వేడి సంభాషణలతో సినిమా రంగంలో రచయితగా ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న త్రిపురనేని మహారథి ఈ రోజు ఉదయం హైదరాబాదులో స్టార్ ఆసుపత్రిలో మరణించారు. ఎనభై సంవత్సరాల మహారథి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యన్టీఆర్ నటించిన 'బందిపోటు' సినిమా ద్వారా రచయితగా ప్రవేశించినా, మహారథి ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల చిత్రాలకు పనిచేశారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో ఆయన పేల్చిన మాటల తూటాల శబ్దం ఇంగ్లాండు దాకా వినిపించిందంటే అతిశయోక్తి కాదు! అంతగా అవి ప్రాచుర్యం పొందాయి. కంచుకోట, రణభేరి, పెత్తందార్లు, దేశోద్దారకులు, దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దొంగలు, పాడిపంటలు, హేమా హేమీలు, సింహాసనం... వంటి పలు చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. మొత్తం 25 చిత్రాలకు ఆయన మాటలు రాశారు. మరో పాతిక చిత్రాలకు సహకారం అందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పద్మాలయా సంస్థకు ఆస్థాన రచయిత అనే చెప్పాలి.

     1930 ఏప్రిల్ 30 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో పుట్టిన మహారథి భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. అయితే, కాలక్రమంలో భూమంతా హరించుకుపోగా, వీరి కుటుంబం నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామానికి వలస వచ్చేసింది. దాంతో, తెలంగాణా సంస్కృతిలో కలిసిపోయారు. హైదరాబాదుతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివే ఉద్యోగం కూడా చేశారు. నిజాం కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనంతర కాలంలో సినిమా రంగంపై మక్కువతో కె.బి.తిలక్, కె.యస్.ప్రకాశరావు వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో చేరారు. అనుకోకుండా రచయితగా మారారు. ఆయన సంభాషణలు కూడా ఆయన మాటలలానే సూటిగా, ఎటాకింగ్ గా వుంటాయి. జానపదాలకు రాసినా, పల్లెటూరి కథా చిత్రాలకు రాసినా ఆయన శైలి ఆయనదే. ఎన్ని రాసినా 'అల్లూరి సీతారామరాజు' సినిమాకు తాను రాసిన డైలాగులే ఆయనకు ఇష్టం. యన్టీఆర్ తో మహారథి ఎంతో సాన్నిహిత్యంగా మెలిగారు. తెలుగు దేశం పార్టీ స్థాపన సమయంలో యన్టీఆర్ తో కలిసి తిరిగారు. అయితే, బేదాభిప్రాయాల వల్ల బయటకు వచ్చారు. తన సిద్ధాంతాల కనుగుణంగా 'త్రిలింగ ప్రజా సమితి' పేరుతో ఏకంగా ఓ రాజకీయ పార్టీనే నెలకొల్పారాయన. అయితే, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరూ గెలవలేకపోయారు. ఆయన తనయుడు త్రిపురనేని చిట్టిబాబు కూడా సినిమా రంగంలోనే వున్నారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారాయన.

       మహారథి వ్యక్తిత్వం విభిన్నమైనది. ఆ పంచె కట్టులో ఆయనను చూస్తే అచ్చ తెనుగు రైతు గుర్తొస్తాడు. అందుకే చిత్రసీమలో ఆయనను 'రైతు కవి' అని కూడా ముద్దుగా పిలిచేవారు. అదే సమయంలో ఓ రుషిపుంగవుడు కూడా ఆయనలోకనిపిస్తాడు. రాజకీయాల నుంచి రసరమ్య కావ్యాల వరకు, మనస్తత్వ శాస్త్రం నుంచి వేదాంత సారం వరకు దేని గురించి మాట్లాడమన్నా గంటలకొద్దీ ఆయన ప్రసంగిస్తారు. ఎవరికీ తలవంచని మనిషి ఆయన. ఎవరేమనుకున్నా సరే తను అనుకున్నది చెప్పి తీరేవారాయన. ఆయనకస్సలు లౌక్యం తెలియదు. ముక్కు సూటి మనస్తత్వం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆ నైజం ఆయనను చాలామందికి దూరం చేశాయి. అయినా ఆయన అసమాన ప్రతిభ మాత్రం ఎందరికో దగ్గర చేసింది. తెలుగు ప్రేక్షకులు ఆయనను కలకాలం గుర్తుంచుకోవడానికి ఆయన రాసిన ఒక్క 'అల్లూరి సీతారామరాజు' సరిపోదా?  
X

Feedback Form

Your IP address: 67.225.212.107
Related News
Movie News (Latest)